Friday, September 24, 2010

చిత్రకళ, ఛాయాచిత్రకళా లోతులతో పాటు జీవితపు సుడిగాలులను కూడా సమానంగానే తాకిన గుడిమళ్ల భారత్‌భూషణ్

చిత్రంగా మళ్లీ చేతికొచ్చిన కుంచె

ఇష్టంగానో అయిష్టంగానో ఓ నావను ఎక్కేసి నడిసముద్రంలోకి వెళ్లాక, ఉన్నట్లుండి నావ మునిగిపోవడం మొదలెడితే ఏం చేస్తాం? తాచుపాముల్లా నీళ్లు నావలోకి తన్నుకు వస్తుంటే ఏం చేయగలం? నావలోంచి దూకేయాలనిపించడం సరే కానీ, దూకేశాక నడి సముద్రంలోంచి తిరిగి ఒడ్డుకు చేరేదెలా? ప్రాణాలు నిలవాలంటే ఆ సమయంలో ఏదో ఒక ఆలంబన కావాలి.

కానీ, ఎవరా ఆలంబన? ఏమిటా ఆధారం? పాతికేళ్లుగా ఉన్న ఫొటోగ్రఫీ వృత్తిలో ఇక కొనసాగడం సాధ్యం కాదని వదిలేయవలసిన స్థితికి అసలు కారణమేమిటి? ఎప్పుడో టీనేజ్‌లో ఎంతో వ్యధతో దూరం చేసుకున్న చిత్రకళను తిరిగి గుండెలకు హత్తుకున్న వైనమేమిటి? చిత్రకళ, ఛాయాచిత్రకళా లోతులతో పాటు జీవితపు సుడిగాలులను కూడా సమానంగానే తాకిన గుడిమళ్ల భారత్‌భూషణ్ జీవన చిత్రం ఆయన మాటల్లోనే...


ఏదో అనుకుని మరేదో అయిపోవడం మానవ జీవితంలో అరుదేమీ కాదు. బతుకు మార్గాల్లోకి చూసినా చాలా వరకు మనం అభిలషించేదీ, అమితంగా ప్రేమించేదీ ఒకటైతే, మనం బంధీ అయ్యేదీ, వెంటబడి వెళ్లేదీ మరొకటవుతూ ఉంటుంది. ఇది నాదారే కాదని అప్పటిదాకా ఘోషించిన మనసే నిస్సహాయంగా మరెవరో నిర్ధేశించిన లక్ష్యాన్ని స్వీకరిస్తుంది. నా విషయంలో జరిగిందీ ఇదే.... వరంగల్ మా స్వస్థలం.

నేను 10వ తరగతి చదివే రోజుల్లో అంటే 1969లో తెలంగాణ ఉద్యమం మొదలయ్యింది. క్రమంగా ఉధృత మయ్యింది. పెద్దవాళ్లంతా ఉద్యమంలో పాల్గొనే వారు. నాది చాలా చిన్న వయసు కావడ ం చేత ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయే వాణ్ని. నాకు ఆ సమయమంతా ఆర్ట్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడింది. పెద్ద పెయింటర్‌నైపోవాలన్న ఆకాంక్ష ఆ వయసులోనే నాలో ఎంతో బలంగా ఉండేది. కానీ, ఆ దిశగా నా ప్రయాణం ఎంతో దూరం సాగలేదు

కుంచె జారిపోయింది
చిత్రకళ పట్ల నాకున్న మక్కువను తొలిసారిగా ఇంట్లో అలా వ్యక్తం చేశానో లేదో " ఏడి శినట్లుంది నీ ఆలోచన. పేయింటింగ్ నేర్చుకుని గోడల మీద గీతలు గీసుకుంటూ, సైన్‌బోర్డులు రాస్తూ బతికేస్తావా? లాంటి ప్రశ్నలు నా మీద విరుచుకుపడేవి. "ఆర్ట్ అంటే సైన్‌బోర్డులు రాయడం మాత్రమే కాదు'' అని చె ప్పేంత శక్తి అప్పటికింకా లేదు.

చివరికి ఆర్ట్ నా మనసులో గూడుకట్టుకుపోయిందే తప్ప అది నా చేతుల్లో లేకుండా పోయింది. వేళ్లలోకి రావలసిన కుంచె పక్కకు జారిపోయి ఆ స్థానంలో కెమెరా వాలిపోయింది. అలా నేను 26 ఏళ్లపాటు ఫోటోగ్రాఫర్‌గా పనిచేశాను.

ఫోటోగ్రఫీలో గడిపిన ఆ పాతికేళ్ల జీవితాన్ని ఆర్ట్‌కోసమే వెచ్చించి ఉంటే నిస్సంకోచంగా నేనో అంతర్జాతీయ స్థాయిని అందుకునే వాణ్ని. చివరికి ఎన్నో ఏళ్ల తరువాత అంటే మూడేళ్ల క్రితం తిరిగి ఈ రంగంలోకి ప్రవేశించాను. పెయింటింగ్‌లోకి పూర్తిస్థాయిలో దిగిపోయాను. ఇలా రావడానికి ఒక బలమైన కారణం ఉంది.

నా జీవితంలో ఒక ఉప్పెన
"పదేళ్ల క్రితం నాకు గొంతు క్యాన్సర్ ఉన్నట్లు బయట పడింది. మూడేళ్ల పాటు పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్ కొనసాగింది. క్యాన్సర్ కారణంగా జనరల్ హెల్త్‌కూడా దెబ్బతిన్నది. బిపి, షుగరూ మొదలయ్యాయి. ఒక సారి హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఈ స్థితిలో ఫోటో జర్నలిస్టుగా ఉరుకూ పరుగులు నేను చేయలేనని స్పష్టమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అంటే మరో వృత్తి ఏదైనా ఎంచుకోవాలి.

మృత్యువు నీడలో...
నా మట్టుకు నాకు ఎప్పుడో దశాబ్ధాల క్రి తం దూరమైన ఆర్టే పెద్ద ఆలంబనగా కనిపించింది. 26 ఏళ్లపాటు ఫోటోగ్రఫీయే వృత్తిగా సాగిన నా జీవితం మూడేళ్ల క్రితం తిరిగి పెయింటింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఇన్నేళ్ల తరువాతైనా నేను ప్రేమించిన రంగంలోకి ప్రవేశించ గలిగానే అన్న సంతోషమైతే ఉంది. కానీ, ఆ సంతోషం మీద మృత్యు నీడలు కదలాడుతున్నాయి.. క్యాన్సర్‌నుంచి ఒకరకంగా బయటిపడినట్లే అనిపిస్తున్నా ఇది మళ్లీ ఎప్పుడైనా తిరగబెట్టనూవచ్చు. అలా చూస్తే నాకున్న జీవిత కాలం తక్కువే.

అందుకే నాలో ఆవేదన ఎక్కువ. మృత్యువు అనుక్షణం అతి సమీపంగా ఉండడం వల్లే ఎక్కువ వేగంగా పనిచేయగలుగుతున్నానేమో అనికూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో పదివేల స్కెచ్‌లు వేసిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచాడు.

అది చూసి కనీసం నేను ఓ వెయ్యి స్కెచెస్ అయినా వెయ్యొచ్చు కదా అన్న ఐడియా వచ్చింది. అలా స్కెచ్‌లు వేయడం మొదలై ఒక సంవత్సరంలోనే 1000 దాకా స్కెచ్‌లు వేశాను వీటికితోడు ఈ మూడేళ్ల కాలంలో 400 డ్రాయింగ్స్, 150 పేయింటింగ్స్ కూడా వేశాను. ఇప్పుడింక ఆర్టే నా జీవనాధారం అయింది.

దారి మారిపోయి...
"నా ఫోటోగ్రాఫిక్ వర్క్స్ కూడా ప్రశంసలు అందుకున్నాయి. కానీ ఎన్ని ప్రశంసలు వచ్చినా ఆర్ట్‌లో ఏమీ చేయలేకపోయానే అన్న మనోవ్యధ ఇన్నేళ్లూ దహించివేస్తూనే ఉండిపోయింది. అయితే ఇందుకు తల్లిదండ్రులనే పూర్తిగా బాధ్యుల్ని చేయలేం. వారిని ప్రభావితం చేసిన సమాజపు విలువలు కూడా అందుకు కారణమే.

ఏమైనా సాధారణ సామాజిక విలువల కోసం సృజనాత్మక జీవులను అడ్డుకోవడం మాత్రం సరికాదనే అంటాను. తాము ఎంచుకున్న మార్గంలో అయినవాళ్లు ఆశించిన స్థాయి, వైభవంతో జీవించలేకపోవచ్చు. కానీ, వారు అందులో అద్భుతాలు చేస్తారు. ఆత్మతృప్తితో జీవిస్తారు. ఆ తృప్తిని ఎందరికో పంచుతారు.

ఒకటి మాత్రం నిజం. సామాజిక గౌరవాలూ, హోదాలకూ అతీతంగా సృజనాత్మక జీవులను ప్రోత్సహించగలిగితే విజయాల సంఖ్య కచ్ఛితంగా ఇప్పటికన్నా వేయింతలు పెరుగుతుంది. ''అంటూ ముగించారు.
-బమ్మెర

No comments: