Saturday, October 30, 2010

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా .........


నల్లగొండ జిల్లాతో కలిపి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చునని వచ్చిన వార్తపై తీవ్ర దుమారం చెలరేగింది. ఎకనమిక్స్ టైమ్స్ లో వచ్చిన ఈ వార్తాకథనాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి  (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఓ సమావేశంలో బయటపెట్టి, ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. ఆ ప్రతిపాదనపై నిప్పులు చెరిగారు. హైదరాబాదు లేని తెలంగాణ  తల లేని మొండెం అన్నారు. తెలుగుదేశం  తెలంగాణ ప్రాంత నాయకులు హుటాహుటిన శ్రీకృష్ణ కమిటీకి తన వ్యతిరేకతను తెలిపారు. ఇంతగా సంచలనం కలగడానికి కారణం లేకపోలేదు.


హైదరాబాదు తెలంగాణ ప్రాంతానికి చారిత్రకంగా రాజధానిగా ఉంటూ వస్తోందని, పైగా అది తెలంగాణ నడిబొడ్డున ఉందని, అందువల్ల తెలంగాణ నుంచి హైదరాబాదును వేరు చేయడం కుదరదని తెలంగాణవాదులు అంటూ వస్తున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాదు వేరు చేయడం భౌగోళికంగా సాధ్యం కాదని ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటూ వచ్చారు. అది సాధ్యమనే విషయం తాజాగా తెలిసి వచ్చింది. పైగా, అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక సమర్పిస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ పదే పదే అంటుండంలోని ఆంతర్యం తెలిసి వచ్చినట్లయింది. సీమాంధ్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్ర్ ఏర్పాటును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలిసిందే. హైదరాబాదు కోసమే వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేస్తే ఆ వ్యతిరేకత రాదు. సీమాంధ్రుల నుంచి వ్యతిరేకత రాకుండా చూడడానికి అదే మందని శ్రీకృష్ణ కమిటీ ఆలోచనలో ఉండవచ్చు. దానికి తెలంగాణవాదులను ఒప్పించడం కూడా పెద్ద కష్టం కాదని అనుకుంటూ ఉండవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే, భౌగోళికంగా హైదరాబాదును తెలంగాణ నుంచి వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి గల అవకాశాలను చూద్దాం.

తెలంగాణవాదులు అంగీకరిస్తారా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి భౌగోళికంగా సాధ్యమయ్యే పనే. అయితే, నల్లగొండ జిల్లా మొత్తం దాంట్లోకి వచ్చే అవకాశం లేదు. హైదరాబాదుకు, కోస్తాంధ్రకు మధ్య తెలంగాణ రాష్ట్రం ఉండకుండా చూడడమే కావాల్సింది. హైదరాబాదు నుంచి రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ కృష్ణా జిల్లాలోని జగ్గయ్య పేట వరకు, మరో వైపు గుంటూరు జిల్లా సరిహద్దుల వరకు కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి వీలవుతుంది. భౌగోళికంగానే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కూడా ఆ వాదనకు బలం చేకూరే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగుడా వంటి ప్రాంతాల్లోకి కోస్తా వలసలు విరివిగా సాగాయి. కోస్తాకు చెందిన పలువురు చాలా కాలం క్రితమే వలస వచ్చి స్థిరపడిపోయారు. సంపన్నులుగా ఎదిగారు. నాగార్జున  సాగర్ కాలువ కూడా వస్తుండడంతో మిగతా మెట్టప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతాలు కాస్తా సస్యశ్యామలంగా ఉంటాయి. హుజూర్ నగర్ ప్రాంతంలో 11 దాకా సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. చాలా ఫ్యాక్టరీలు కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు చెందినవే. ఆ రకంగా ఆ ప్రాంతంలో కోస్తా వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అక్కడి సంస్కృతి కూడా కోస్తా ప్రాంత సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల కూడా తెలంగాణ నుంచి నల్లగొండ జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని విడదీయడానికి అవకాశం ఉందనే వాదనను ముందుకు తేవచ్చు.


భౌగోళికంగా, సాంస్కృతికంగా నల్లగొండ జిల్లాను కలిపి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా, రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచడానికి తగిన అవకాశాలు ఉన్నాయనే వాదనకు ఏదో మేరకు బలం చేకూరుతుంది. అందువల్లనే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు ఎకనమిక్ టైమ్స్ వార్తాకథనంపై అంత తీవ్రంగా ప్రతిస్పందించారని భావించవచ్చు.

ఇంచీ కూడా ఇవ్వం
హైదరాబాద్ లేకుంటే తలలేని మొండమే..56 నాటి తెలంగాణ ఇవ్వాల్సిందే: కేసీఆర్

యూటీకి ఒప్పుకోం.. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం: కాంగ్రెస్, టీడీపీ నేతలు
రాజధానిపై అప్పుడే రగడ.. 'ఐదు ఆప్షన్లు' అంటూ ఆంగ్ల పత్రిక కథనం
ఖండించిన కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్.. ఢిల్లీలో రాజుకుంటున్న 'ప్రత్యేక' వేడి
రాష్ట్రం ఇవ్వకుంటే సీఎం ఇంటికి కరంట్ కట్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు
హైదరాబాద్‌లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిది. 1956లో ఏ తెలంగాణను ఆంధ్రలో కలిపారో... అదే తెలంగాణ కావాలి. ఇంచి తగ్గినా ఒప్పుకోం.
- కేసీఆర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు


హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం. ఎస్సార్సీలోనూ ఇదే విషయాన్ని గుర్తించారు. హైదరాబాద్‌లేని తెలంగాణను ఊహించుకోలేం.
- టీడీపీ తెలంగాణ నేతలు


ఐదు జిల్లాల్లో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. హైదరాబాద్‌ను యూటీ చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. ఆ ఆలోచన మానుకోవాలి.
- కాంగ్రెస్ తెలంగాణ నేతలు


హైదరాబాద్‌ను యూటీగా సూచిస్తున్నామని ఎందుకు వార్తలు పుట్టిస్తున్నారో అర్థం కావడంలేదు. మేం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తాం.
- కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్


కలిపి ఉంచాలా? వేరు చేయాలా? ఈ విషయం ఇప్పటిదాకా తేలనే లేదు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ దీనిపై ఏం చెబుతుందో తెలియదు. కమిటీ సూచించే 'ఆప్షన్స్'లలో కేంద్రం దేనిని ఎంచుకుంటుందో ఎవరికీ తెలియదు. కానీ... అప్పుడే 'రాజధాని'పై రగడ మొదలైంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చూపబోయే పరిష్కార మార్గాల్లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం కూడా ఉందని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనమే దీనికి కారణం.


కేంద్రం ముందు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఐదు ఆప్షన్లు ఉంచే అవకాశముందంటూ ఈ పత్రిక వెల్లడించింది. దీనిని... కమిటీ సభ్యకార్యదర్శి దుగ్గల్ నిర్ద్వంద్వంగా ఖండించారు. "హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా ఉమ్మడి రాజధానిగా ఉండాలని మేం సూచిస్తున్నామని ముందే ఎందుకు వార్తలు పుట్టిస్తున్నారో అర్థం కావడంలేదు. మేం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తాం. అంతిమంగా కేంద్రం నిర్ణ యం తీసుకుంటుంది'' అని తెలిపారు.


అయి తే... అప్పటికే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 'కేంద్ర పాలిత ప్రాంతం'పై మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలూ దీనిపై స్పందించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ముక్తకంఠంతో నినదించారు. "నల్లగొండ జిల్లాతో కలిపి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయనున్నట్లు కథనం వచ్చింది. దీనిని అంగీకరించేది లేదు. 1956లో ఏ తెలంగాణను ఆంధ్రలో కలిపారో... ఆ తెలంగాణే కావాలి. దానికి ఇంచి తగ్గినా అంగీకరించేది లేదు'' అని కేసీఆర్ తేల్చిచెప్పారు.


'హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ బోర్డు' ఏర్పాటైన సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమావేశంలోనూ సర్కారుకు హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే... సీఎం నివాసంతో సహా మొత్తం పది తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పలువురు ప్రతినిధులు ప్రకటించారు.


మరోవైపు... 'డిసెంబర్ 31' సమీపిస్తుండటంతో ఢిల్లీలో తెలంగాణ వేడి రాజుకుంటోంది. ఈ చర్చల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు ప్రణబ్, చిదంబరం, వీరప్ప మొయిలీలతో చర్చించారు. దుగ్గల్‌తోనూ గవర్నర్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు, భవిష్యత్‌లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.

No comments: