Saturday, September 18, 2010

లేటు వయస్సులో గ్రేటు చాటింగ్

ఇదంతా 65 ఏళ్ల జానకమ్మ అమెరికాలోని వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్న తన ఇద్దరు మనవలు, ఓ మనవరాలితో చేస్తున్న చాటింగ్ అంటే నమ్మగలరా? ఒక్క జానకమ్మే కాదు ...ఎప్పుడో చిన్నప్పుడు ప్రాథమిక విద్యతోటే చదువాపేసి ఇప్పుడు దూరంగా ఉన్న తమ పిల్లల కోసం ఇంటర్నెట్ సావీలుగా మారుతున్న పెద్దవాళ్లెందరో ఉన్నారు. ఆ విశేషాలు... ఐదవ తరగతి వరకే చదువుకున్న జానకమ్మ దాదాపు ఆ అక్షరాలను కూడా మరిచిపోయిన వయసులో అంటే 60 ఏళ్లకు ఇంగ్లీష్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, చాటింగ్ గట్రా నేర్చుకుని కొంచెం ఖాళీ దొరికితే చాలు కంప్యూటర్ ముందు బిజీ అయిపోతున్నారు. ఇది ఆవిడకు, ఆవిడ పిల్లలకు, మనవలు,మనవరాళ్లకు ఆనందంగానే ఉన్నా... పొద్దస్తమానం కంప్యూటర్‌కే అతుక్కుపోతుంటుందని తాతగారు అదే ఆవిడ హబ్బీ ఈశ్వర్రావు విసుక్కుంటారట.

'ఏంలేదు... పిల్లలు ఇంటర్‌నెట్ గురించి చెప్పిన దాంట్లో ఆయనకు కొన్నే బోధపడ్డాయి, నేను చాలా నేర్చుకున్నాను. ఆ ఉడుకుమోత్తనం చూపిస్తుంటారు నా మీద. ఐ డోంట్ కేర్ అనుకో...వేళకు కాఫీలు అందిస్తూ, భోజనం పెట్టి..మాత్రలు ఇస్తూ..నా బాధ్యత కరెక్టుగానే చేస్తున్నాను. ఖాళీ సమయంలో మాత్రమే కదా... ఇంటర్‌నెట్ ముందుంటా... అయినా ఆయనకు కోపమే. బికాజ్..హి కాంట్ చాట్' అని తాతగారిని ఆటపట్టిస్తూ కాఫీ తేవడానికి వంటింట్లోకెళ్లింది ఆవిడ. 'రాకేమీ కాదు...ఈ వయసులో నాకిప్పుడు అవసరమా అని దృష్టిపెట్టలేదంతే. ఏమీ తెలీకుండానే గవర్నమెంట్ సర్వెంట్‌గా రిటైరయ్యానా..? ఆమె ఇప్పుడిప్పుడే లోకం చూస్తోంది కాబట్టి వింతగా ఉందేమో. రేడియో నుంచి డైరెక్ట్ కంప్యూటర్‌కొచ్చిన బాపతు. మనం అలా కాదు. ఎన్ని చూశాం? ఎంత అనుభవం..' అంటూ ఆవిడ మాటలకు సంజాయిషీతో పాటు తన గొప్పదనాన్నీ చెప్పుకొచ్చారు తాతగారు.

ఇంగ్లీషుతో పాటు ఇంటర్నెట్టూ...
ఈ దంపతులు సికింద్రాబాదు వాసులు. జానకమ్మ గృహిణి. ఈశ్వర్రావు సెక్రటేరియట్‌లో సూపరింటిండెంట్‌గా చేసి రిటైరయ్యారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరబ్బాయిలు. ఒక అమ్మాయి. అబ్బాయిలిద్దరూ అమెరికాలో ఉంటారు. అమ్మాయి కాన్పూర్‌లో ఉంటుంది. వాళ్లతో టచ్‌లో ఉండాలంటే ఫోన్లు, ఇంటర్నెట్టే మార్గాలు వీళ్లకు. 'కాని ఫోన్‌లో మాట్లాడాలంటే మావారికి గట్టిగా చెబితే కాని వినపడదు.

నాకూ అంతేననుకోండి. అయినా పాపం మా పిల్లలు ఫోన్లో అరుస్తూనే ఉంటారు. దానికన్నా మెయిల్ పెట్టుకోవడం, చాటింగ్ చేసుకోవడమే సుఖమనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడో యాభై ఏళ్ల కిందట ఆపేసిన చదువును మావారి ప్రాణం తీసి ట్యూషన్ పెట్టించుకుని మళ్లీ ప్రారంభించాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసే ఓ అమ్మాయి ఇంగ్లీష్‌తోపాటు ఇంటర్నెట్టూ నేర్పింది' అని చెప్పారు జానకమ్మ మురిపెంగా.

'అవి నేర్చుకోడానికి మా ఇంటిల్లిపాది ప్రాణాలను ఎలా తోడిందో కూడా చెప్పమనండి....మా ఇంటికి కంప్యూటర్ వచ్చిన కొత్తలో అయితే పొద్దస్తమానం దానిముందే కూర్చోనేది. సమయానికి అన్నపానీయాల్లేవ్..మందులు మాకులు అందక షుగర్ పెరిగి దాదాపు ఆసుపత్రి పాలైనంత పనైంది నాకు. మా పెద్దబ్బాయి రావాల్సి వచ్చింది అమెరికా నుంచి' కామెంట్ చేశారు ఈశ్వర్రావు.

గెటింగ్ హెడేక్
'అంత సీన్ లేదు. నేను త్వరత్వరగా నేర్చుకున్నానని... ఆయనకు రాలేదని అక్కసంతే'అంటూ కౌంటర్ వేసారు జానకమ్మ. 'అన్నిటికీ ఇలాగే మొండి వాదన. ఇందుగలడు అందులేడనే సందేహం వలదు అన్నట్టుగా దీనికి ఉపయోగం..దానికి లేదు అని కాకుండా ప్రతిదానికి టెక్నాలజీని తోడు పెట్టుకుంటుంది. కంప్యూటర్ సరే...సెల్ కూడా ఎప్పుడూ చేతిలో ఉండాల్సిందే...అదేదో ఆభరణం అయినట్టు.

విషయం ఏంటంటే...నాతో గొడవపడి మాటలు మానేసినప్పుడల్లా సెల్లే మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ టూల్. మాట్లాడకుండా ఎస్సెమ్మెస్‌లు పంపుతుంది... ఫుడ్ రెడి, ఇట్ ఈజ్ ఆన్ ది టేబుల్...హాట్ వాటర్ రెడీ..ఐయామ్ గోయింగ్ టు టెంపుల్..డోంట్ షవుట్ ఐయాం గెటింగ్ హెడేక్ అంటూ. నీ మొహం అని నేనూ పెడతాననుకోండి... అప్పుడు 'మీ కన్నా బాగానే ఉంది' అని రివర్స్ పంపుతుంది. అలాంటప్పుడే ఈ సెల్‌ని కొనిపెట్టిన మా పిల్లలను తిట్టాలనిపిస్తుంది' గోడు వెళ్లబోసుకున్నారు పెద్దాయన.

ఆయనకు రాదు
'నేను పది ఎస్సెమ్మెస్‌లు పంపే లోపు ఆయన ఒక్కటి టైప్ చేస్తారు. సరిగా చేయడం రాదు. మా మనవలు, మనవరాళ్లతో నేను చాటింగ్ చేస్తుంటాను కదా..అందుకే కొంచెం ఫాస్ట్. పైగా వాళ్ల షార్ట్‌కట్ పదాలు నాకూ అలవడ్డాయి. బికాజ్ ఉందనుకోండి.. ఎస్సెమ్మెస్‌లో బి రాసి కాజ్ రాస్తాం కదా..అలా రాస్తే తనకు అర్థం కాదు. ఫర్ యూ కి ఫోర్ అంకె వేసి ఇంగ్లీషు యూ రాస్తే అదీ బోధపడదు. నీ మొహం... మీరు అక్షరాలను, స్పెల్లింగులను అలా ఇష్టమొచ్చినట్టు రాస్తే సరా అంటూ విసుక్కుంటారు. వయసులో ఉన్నప్పుడు చదువు రాదు అని ఎంత ఏడిపించారో ఆ కసి అంతా తీర్చుకుంటున్నానిప్పుడు.

థాంక్స్ టు మై చ్రిల్డన్ అండ్ థాంక్స్ టు టెక్నాలజి' వివరించారు జానకమ్మ. దూరంగా ఉన్న పిల్లలతోనే కాదు ఊళ్లోనే ఉన్న తన స్నేహితులతో కూడా ఇంటర్నెట్ చాటింగ్, మెయిల్స్ పెట్టుకోవడం చేస్తుంటారట ఆమె. అంతేకాదు ఇక్కడ ఏ చిన్న పండగైనా...వాళ్లిద్దరి పుట్టిన రోజులు, పెళ్లిరోజు..నోములు, వ్రతాలు వంటివేవి జరిగినా హ్యాండికామ్‌తో షూట్ చేసి ఆ వీడియోని మెయిల్లో అప్ లోడ్ చేసి పిల్లలకు పంపుతారట. 'పెళ్లయిన కొత్తలో వంటే వచ్చేది కాదు, నేనే దగ్గరుండి నేర్పాను..అలాంటిది ఈ వయసులో చూడండి..ఎలా తయారయిందో' అంటూ నిజంగానే అక్కసు వెళ్లగక్కారు ఈశ్వర్రావు.

టీవీ కన్నా కంప్యూటరే..
జానకమ్మ ఈశ్వర్రావులే కాదు సికింద్రాబాద్‌లోని మరో జంట లలిత, బిట్ల వెంకటేశ్వర్రావులూ అంతే. టెక్నాలజీ ఫ్రెండ్లీయే. వీళ్లకు ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురూ అమెరికాలోనే ఉంటున్నారు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. వీరి జీవితంలోకి టెక్నాలజీ టూల్స్ ఎలా ప్రవేశించాయో చెపుతూ లలిత ' నేను టెన్త్ వరకే చదువుకున్నాను. అదీ అప్పటి చదువు. మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ చదివేప్పుడే అంటే ఓ పదేళ్ల కిందటే కంప్యూటర్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత వాడు అమెరికా వెళ్లాక మొత్తం దాని మీదే ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడు విదేశాల్లో ఉన్నవాళ్లతో మాట్లాడాలంటే ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లాల్సిందే.

అలా అలవాటైంది నాకు. అప్‌లోడ్, డౌన్‌లోడ్, స్కానింగ్ లాంటివన్నీ నాకప్పుడే తెలుసు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడ్డం ఎక్కువై మెయిల్స్ పెట్టడం తగ్గింది. అయినా మా కోడళ్లకి కావాల్సిన వంటల రెసిపీలు వంటి వాటిని మెయిల్ చేస్తాను. వీడియోలు తీసి వాటిని అప్ లోడ్ చేస్తాను. నెట్‌లో బాగా అనిపించిన సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటాను. ఖాళీ టైంలో టీవీ కన్న కంప్యూటర్‌తోనే నాకెక్కువ కాలక్షేపం' అని చెప్పారు.

ప్రపంచాన్ని చిన్నదిగా చేసింది
బిట్ల వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ..'నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో రిటైరయ్యాక న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌లో జాయిన్ అయ్యాను. ఉద్యోగ ధర్మంగా కూడా సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను అప్‌డేట్ చేసుకోవాల్సిందే. కాని నాకు మా పిల్లల ద్వారానే దీని గురించి ఎక్కువ తెలిసింది. దానికి సంబం«ధించిన పదజాలం కూడా మా పిల్లల ద్వారానే అలవాటైంది. మొన్ననే మేము అమెరికా వెళ్లొచ్చాం. వెళ్లే ముందే అక్కడి విషయాలను, విశేషాలను, సమాచారాన్ని నెట్‌ద్వారా తెలుసుకున్నాం. దాంతో అదో కొత్త ప్రదేశంలాగా ఏమీ అనిపించలేదు. టెక్నాలజీ ప్రపంచాన్ని చిన్నదిగా చేసింది'అని చెప్పుకొచ్చారు.

చందమామ కథలూ...
పిల్లల కోసం, పిల్లల ద్వారా అయితేనేం కొత్త విషయాలను తెలుసుకోవడంలో తమకు పరిచయంలేని వస్తువులను వాడడంలో పెద్దలు ఈ తరం పిల్లలతో పోటీపడుతున్నారు . ఇంకా చెప్పాలంటే ఉత్సాహం చూపుతున్నారు. ఎక్కడా మాది పాత తరం అన్న జంకు లేదు. ఎక్కడో సప్త సముద్రాల ఆవల ఉన్న తమ మూడోతరానికి చాటింగ్‌లో చందమామ కథలు, వీడియో క్లిప్పింగుల్లో పండగ సంప్రదాయాలను, సెల్ ఫోన్లో రామాయణ, భారతాలను వినిపించి పనిలో పనిగా సంస్కృతిని కూడా పరిరక్షించేన్నారు.
జూ సరస్వతి రమ
ఫోటోలు: రాజ్‌కుమార్

No comments: