జీవితంలో నటన " 'తేనె పూసిన కత్తి, మేక వన్నె పులి ' వంటి మనుషులుంటారని కథల్లో చదివాం, సినిమాల్లో చూశాం. కానీ మా అమ్మాయికి అటువంటి అత్తగారు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు మేము పెద్ద సమస్యలో చిక్కుకున్నాము. మీరే రక్షించాలి!" అంటూ ఓ మహిళ కన్సల్టేషన్ రూంలో భోరుమంది. "ఏమీ పరవాలేదు. మనుషులకూ, మానులకూ ఈ రోజుల్లో కష్టాలు తప్పటం లేదు. అయినా మీ అమ్మాయికి వచ్చిన కష్టమేమిటో వివరంగా చెప్పండి" అన్నాను. "సరిగ్గా ఈ రోజుకు నెలయ్యింది మా అమ్మాయి పెళ్లి జరిగి. అబ్బాయీ, అమ్మాయీ ఇంజనీరింగు చదువుకుంటూ ప్రేమించుకున్నారు. చదువులయ్యాక పెళ్లి చేయమని కూర్చున్నారు. వాళ్ల అంతస్తుకూ, కులానికీ మనం తూగలేము. మనకీ పెద్ద సంబంధాలు వద్దు - అని ఎంత చెప్పినా మా అమ్మాయి వినలేదు. చివరికి ఆ అబ్బాయి వాళ్ల మేనమామను మా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని పెళ్లికి ఒప్పించాడు... సరే, పెళ్లి జరిగింది." "ఇంతకూ మీకొచ్చిన సమస్య ఏమిటి? అసలు విషయానికి రండి" అన్నాను. "ఇదుగో, చెప్తున్నా. పెళ్లయ్యి అంతా బాగుందనేసరికి, ఆడపడుచూ, అత్తగారూ ఒక మెలిక పెట్టారు. దాంతో భార్యాభర్తలు మాట్లాడుకోవటం లేదు. నెల రోజుల్లో ఇద్దరూ జర్మనీ వెళ్లాల్సినవాళ్లు యిలా ఎడమొహం, పెడమొహవమైతే ఎలా? అందుకనే వాళ్లిద్దరినీ తీసుకొచ్చాను. ఏంచేస్తారో చెయ్యండి!" అంది ఆవిడ. "వెరీ గుడ్! వాళిద్దరినీ లోపలికి పంపండి. మీరు బయటే కూర్చోండి" అన్నాను. "నేనుంటే వాళ్లకు ఏ అభ్యంతరం లేదు. నాకు తెలియని రహస్యాలేముంటాయి కనుక?" అంది. "సారీ! మీరుంటే నాకు అభ్యంతరం వుంది. నేను వారిని పర్సనల్ ప్రశ్నలు అడగాలి. మీ అల్లుడు చెప్పడానికి సిగ్గు పడవచ్చు" అన్నాను. "ఊ, సరే!" అని సణుక్కుంటూ బయటికి వెళ్లి కూతుర్నీ, అల్లుణ్నీ పంపింది. ఇద్దరూ చక్కగా, అందంగా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లున్నారు. వచ్చి మౌనంగా కూర్చున్నారు. "హలో! ఎలా ఉన్నారు? ఎప్పుడు మీ జర్మనీ ప్రయాణం?" అని పలకరించాను. "జర్మనీ మాటెలా వున్నా ఈ జీవితం నుంచే వెళ్లిపోవాలని వుంది!" అంది అమ్మాయి నిరాశగా. "ఛ! ఛ! పెళ్లయి నెల కూడ అవ్వలేదు. అలాంటి మాటలనకూడదు. ఇంతకూ మీ ఇద్దరి మధ్యా వచ్చిన పేచీ ఏమిటో చెప్పండి." "నిజానికి మా ఇద్దరి మధ్యా పేచీ ఏమీ లేదు. మేము బాగానే వున్నాం. మా అత్తగారే అసలైన రాక్షసి! ఆవిడ వల్లే ఇంత గొడవొచ్చిపడింది!" అంది అమ్మాయి కసిగా. "ప్లీజ్! మా అమ్మను విమర్శించవద్దని చెప్పండి. ఆమెను ఏదైనా అంటే నేనిక్కడి నుంచి వెళ్లిపోతాను" అన్నాడు అబ్బాయి సౌమ్యంగా. మెల్లిగా ఇద్దరినీ మాటల్లోకి దింపి, భార్యాభర్తల మధ్య ఎటువంటి సంబంధాలుండాలి, ఎలా అడ్జస్ట్ అవాలి - వంటి విషయాలు చెప్పి, వాళ్లిద్దరి మధ్య వున్న అసలు తగాదా తెలుసుకున్నాను. నిజానికి సమస్య అతి సూక్ష్మం. అయితే మాటలు పెరిగి అది చివరికి విడాకులకు దారితీసేంత జటిలమైంది. విషయమేమిటంటే, పెళ్లయిన తరువాత ఆ అమ్మాయి భర్తను పేరుతో పిలవటం. అతన్ని 'నువ్వూ అని సంబోధించటం. అది విన్న అత్తగారూ, ఆడపడుచూ అబ్బాయిని ఒంటరిగా పిలిచి నిలదీసి అడిగారట. "నీకసలు సిగ్గుందా? మనింట్లో ఏ ఆడదైనా మొగ్గుణ్ని నువ్వు అంటుందా? ఇప్పుడే చెప్తున్నాం జాగ్రత్త! ఆ అమ్మాయిని 'ఏమండీ' అని పిలవమని చెప్పు. లేదా మేమే చెప్పాల్సివస్తుంది" అని వార్నింగ్ ఇచ్చారు. ఆ అబ్బాయి నవ్వుతూ "అదేం పరవాలేదులే, చిన్న విషయం" అంటూ వెళ్లిపోయాడు. అతను భార్యకు చెప్పలేదు. ఆ అమ్మాయి అలాగే నువ్వు, నువ్వు అంటూ మాట్లాడటం భరించలేక ఒకసారి అత్తగారు అమ్మాయిని పిలిచి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ! "అసలు ఈ మహానుభావుణ్ని పెళ్లికి ముందే అడిగాను నిన్ను పేరుతో పిలవొచ్చా? అని. అన్నింటికీ బుర్ర ఊపాడు. ఇప్పుడు 'ఏమండీ' అని పిలిపించుకోవాలనిపిస్తే నాకే చెప్పొచ్చు కదా! ఆవిడ చేత ఎందుకు చెప్పించాడు?" అంది ఉక్రోషంగా. "నేను మా అమ్మకు అసలు ఆ మాట చెప్పలేదు. ఆవిడ ఉద్దేశం చెప్పింది. దానికి నన్నంటే ఊరుకునేది లేదు!" అన్నాడు అబ్బాయి. "ఊరుకోకపోతే మీరూ, మీ అమ్మా ఉరేసుకోండి!..." అని ఇంకా ఏదో అనబోతుంటే ఆ అబ్బాయికి కోపం వచ్చి, ధనామని కుర్చీ వెనక్కు తోసేసి బయటికి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి భోరున ఏడ్చేసింది. బయట ఎదురుచూస్తున్న అమ్మాయి తల్లి పరుగుపరుగున లోపలికి వచ్చి, "ఏమైంది?" అని అడిగింది. "ఏమీ అవలేదు. మీరు కంగారు పడకండి." అన్నాను. మళ్లీ ఆవిడ కలగజేసుకుని, "సార్! మీరు దయచేసి దీని అత్తగారికి ట్రీట్‌మెంట్ ఇస్తే మొత్తం సర్దుకుంటుంది" అంది కసిగా. "మీరు ఆవిడను తీసుకురాగలరా?" అని అడిగాను, ఏమంటుందోనని. "ఆవిడెందుకు వస్తుందీ? నాకే రోగం లేదంటుంది ఆ మహానుభావురాలు!" అంది కోపంగా.. "అందుకే నేను చెప్పింది వినండి" అంటూ అమ్మాయికేసి తిరిగి, "నువ్వు అతనితో కాపురం చెయ్యాలనుకుంటున్నావా?" అని అడిగాను. "చెయ్యాలనే అనుకుంటున్నాను. కానీ ఇటువంటి ప్రవర్తన చూస్తే మండిపోతూంది!" అంది. "నిజమే... కానీ ఇందులో నిజంగా అతని తప్పేం లేదు. అలాగని అతని తల్లి తప్పు కూడా లేదు. నిన్ను ప్రతి క్షణం రెచ్చగొడుతూ, అత్తగారి మీద కారాలూ, మిరియాలూ నూరుతున్న మీ అమ్మగారిది తప్పు!" అన్నాను. "ఇదేమిటీ? మధ్యలో నా మీద..." ఇంకా ఆవిడ ఏదో అనబోతూండగా అడ్డు చెప్తూ, "మీరు కాస్సేపు వుండండి. నీ భర్త నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు అతని తల్లిని విమర్శించటం భరించలేకపోయాడు. నువ్విపుడు తెలివిగా అతన్ని సంతోషపెట్టాలంటే అత్తగారిని మంచి చేసుకోవాలి. అందులో భాగంగా ఆవిడ ముందు భర్తను 'ఏమండీ!' అని పిలు. ఇష్టం లేకపోయినా అలా నటించు. కొన్నాళ్లపాటు ఇక్కడి విషయాలు మీ అమ్మకు చెప్పకు" అని చెప్పాను. "మీరేదో సమస్య పరిష్కరిస్తారనుకుంటే ఇదేనా మీరిచ్చే సలహా?" అంది తల్లి విసుగ్గా. "అమ్మా! మీరు కాసేపు మాట్లాడకండి. దీనికి ఇంతకు మించిన పరిష్కారం లేదు. అతని తల్లికీ, అక్కకూ చెప్పడం అసాధ్యం. అలాగే అతను కూడా వారికి చెప్పడం కుదరదు! ఒకవేళ చెప్పగలిగినా జోరూ కా గులాం - అని జీవితాంతం సాధిస్తారు. లేదా మీరన్నట్లు ఈ చిన్న విషయానికి విడాకులు తీసుకోవటం అన్యాయం! కాబట్టి మీ అమ్మాయి రాజీపడి నటించాలి. నటన మాత్రమే. అత్తగారి ముందు భర్తను 'ఏమండీ' అని పిలిచి, బెడ్ రూంలో 'ఒరేయ్!' అని కూడా పిలుచుకోమనండి. మీరు దయచేసి మధ్యలో కల్పించుకోకండి!" అని చెప్పి పంపేశాను. చిట్కా అద్భుతంగా పని చేసింది. మొన్న జూన్‌లో ఒద్దరూ జర్మనీ ఎగిరిపోయారు. | |
Dr. బి.వి. పట్టాభిరాం |
Wednesday, October 15, 2008
గ్రేటర్ హైదరాబాది
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
where is ur proper way, try to good understands about greater hyderabad
Post a Comment