Monday, December 20, 2010

ఏ మాయ చేస్తావే ... !


‘ఒకటే హృదయం కోసమూ..ఇరువురి పోటీ లోకమూ...’ఏనాటిదో పాట. నిజమే మనసుపడిన దేనికోసమైనా పోటీ తప్పదు...కన్నయ్యకు కన్నతల్లి ఒకరు..ప్రాణం పెట్టి పెంచినది మరొకరు. ఇరువురికీ కన్నయ్య కావాలి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చినట్లు..ఎందుకు ప్రారంభమైనా, ఎలా ప్రారంభమైనా, తెలంగాణా పోరు మాత్రం..హైదరాబాదీలకు ఇబ్బందిగా మారుతుందా? ఉద్యమా లు..కారణాలు..సమస్యలు..పరిష్కారాలు..ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతం..మరి కావాల్సిందేమిటి..చెప్పుకోవాల్సింది ఎంత..తెలుసుకోవాల్సింది ఇంకేముంది?

వీటికి సమాధానంకావాలంటే, హైదరాబాద్ గుండె చప్పుడు మాత్రం వినాలి..ఇక్కడి వారైనా..ఎక్కడి వారైనా..ఈ నగరంతో పెనవేసుకున్న బంధాన్ని చూడాలి..ఈ గుండెచప్పుడు, పెనవేసుకున్న బంధం తెలియాలంటే..హైదారాబాద్ గురించి తెలియాలి. ఈ నగరపు సొగసు తెలియాలి. ఈ నగరపు నయగారం అనుభవంలోకి రావాలి.. ఎంతవారినైన మంత్రముగ్ధుల్ని చేసి, ఇక్కడ నుంచి వెళ్లకుండా చేసే హైదరాబాద్ మాయను తెలుసుకోవాలి. నాలుగు వందలకు పైబడిన చరిత్ర కాదు కావాల్సింది..నిండుగా, హాయిగా ఇక్కడే బతికేయడానికి జనం ఎందుకిష్టపడతారో..తెలియాలి. కష్టంగా వున్నా ఇక్కడ వుండడానికే పడే ఇష్టం ఎందుకో కచ్చితంగా తెలుసుకుతీరాలి.


ఏదో తెలియని మాయె..
ఏదో తెలియని హాయె....
ఇలా మొదలవుతుంది..
హైదరాబాద్‌పై పోలీసు శాఖ
తయారుచేసిన చిన్న డాక్యుమెంటరీ..


హైదరాబాద్...చిత్రమైన నగరం..మరి ఈ మట్టిలో ఏ మాయ వుందో..ఏ సుముహూర్తంలో ఈ నగర నిర్మాణానికి పునాది పడిందో..ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, వ్యాహ్యాళికైనా, ఇక్కడకు ఒకసారి వచ్చినవారు తిరిగి వెళ్లడం అంటే అంతగా ఇష్టపడరు. అందుకే ఇక్కడి జనాభా అంతకంతకూ..అలా అలా పెరిగిపోతోంది. నగరం నాలుగు చెరగులా విస్తరిస్తూనే వుంది.
ఇక్కడి ట్రాఫిక్ పద్మవ్యూహాలను విసుక్కుంటూనే చేధిస్తుంటారు. ఇక్కడ ధరలను తలుచుకుని అమ్మో..అనుకుంటూనే గడిపేస్తుంటారు. ఉరకలు పరుగులు పెడుతూనే వారం అంతా గడిపేసి, వారాంతానికి హుస్సేన్ సాగరతీరానికి చేరి, అన్నీ మరిచిపోయి, మరో వారం గడపానికి తయారైపోతారు.
ఏమిటీ ప్రత్యేకత..ఈ నగరానికి..కేవలం ఇక్కడ లభించే ఉద్యోగాలేనా..ఉపాథి అవకాశాలేనా?మరికేమైనా వుందా..మరే నగరానికి లేని ప్రత్యేకతలేమైనా వున్నాయా? ఏ మహానగరానికైనా ఏముంటుంది? కాస్త ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..దాంతో పాటు పెరిగే జనం..తదనుగుణంగా పెరిగే వ్యాపారాలు.సందడి..అంతేనా..
కానీ హైదారాబాద్ అంతే కాదు..చాలా..
హైదరాబాద్ అంటే ఒక సంస్కృతి..మనకు తెలియకుండానే నగరం పట్ల పెరిగే బంధం..చిత్రమైన నగరం ఇది. నిజానికి విశాఖలోలా విశాల సాగర తీరం లేదు. బెంగుళూరులోలా తక్కువ ఉష్ణ్రోగ్రత లేదు..ముంబాయి విలాసాల జాడ అంతగా లేదు..మరేముంది..
చిత్రమైన నగరం
============
ఒక్క మాటలో చెప్పాలంటే..హైదరాబాద్‌లో ఎవ్వరైనా బతికేయచ్చు. అదే ఈ నగరం ప్రత్యేకత. పెద్దగా బతుకుభయం లేదు. పనికి జడవని వారెరైనా, మూడు వేల నుంచి ముఫై లక్షల ఆదాయం కలిగిన వారైనా సరే ఇక్కడ బతికేయచ్చు. మూడు వేలతో బతుకా అన్న భయం కానీ, ముఫై లక్షలున్నాయి..ఖర్చెలా అని కానీ, బాధ పడడం లేదా బోర్ ఫీలవడం ఎంతమాత్రం అవసరం లేదు. అదే హైదరాబాద్ తొలి స్పెషాలిటీ.
పదిహేను వందలకే పదిమందితో కలిసి ఓ మూల పడుక్కుని, ఉదయపు ఉపాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేయించేందుకు వీలుగా ఇక్కడ హాస్టళ్లున్నాయి. అలాగే అంతకు అంతా లగ్జరీ అందించగల పెయిడ్ హోమ్‌లు, గెస్ట్‌హవుస్‌లు ఇక్కడే వున్నాయి.


అటు చూస్తే బాదం హల్వా..ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ అనీ..బాధ పడక్కరలేదు. మన దగ్గర ఎంత వుంటే అంతకే రెండూ అందించే సదుపాయం హైదరాబాద్ స్పెషాలిటీ.


మహంకాళీ మార్కెట్ సందులోకి వెళ్లండి..పది రూపాయల డబ్బులకే స్వీట్లు, హాట్లు రోడ్డు పక్కనే కానిచ్చేయడం గమనిస్తారు. అదే బాగా డబ్బుచేస్తే.. తాజ్‌కో, కాకతీయకో వెళ్లండి..అయిదువందల నోటు కాస్త, ప్లేటు పెరుగన్నంగా మారి కళ్లముందుంటుంది. అక్కడే రెండిడ్లీకి వందల్లో రేటు..ఇక్కడే అయిదు రూపాయలకు అయిదు ఇడ్లీ కూడా రెడీ. గోదావరి జిల్లా నుంచి పొట్ట పట్టుకుని వచ్చిన వారు సైకిళ్లపై ఇల్లిల్లూ తిరుగుతూ, జంక్షన్లలో కాపు కాసి, అయిదు రూపాయాలకు, ఆప్యాయత కూడా నిండిన అయిదు ఇడ్లీ అందించడం ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరి కళ్ల పడే వుంటుంది. దటీజ్ హైదరాబాద్.
ఎవరి స్తోమత వారిది. ఎవరినీ నిర్లక్ష్యం చేయదీ నగరం. అందరినీ అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. అందుకే ఈ నగరం అంటే అందరికీ అంత ఇష్టం. పాత బస్తీకి వెళ్లండి..ఆదివారం ఉదయానే్న చార్మీనార్ ఎదుట కిలోమీటర్ మేర కొలువైన పాతవస్తువుల బజార్ చూడండి..ఎంత సందడిగా వుంటుందో. అక్కడ ఆ వస్తువులు చూస్తే..అవి అమ్మకానికా..అసలు ఎవరు కొంటారు..ఎందుకు పనికి వస్తాయి..అనిపిస్తుంది..కానీ అమ్మకాలు సాగుతూనే వుంటాయి..కొనుగోళ్లు జరుగుతూనే వుంటాయి. అదే ఆదివారం సాయంత్రం ఒడిస్సీకో, క్రాస్‌వర్డ్‌కో, సెంట్రల్‌కో, జీవీకె వన్‌కో ఒక్కసారి వెళ్లండి..ఇన్ని రకాల వస్తువులా..ఏ దేశం నుంచి వచ్చాయో, వాచ్ ఖరీదు లక్షా..పెన్ను పాతిక వేలా..అమ్మో..అని కొందరికి అనిపించినా..కొందరికి మాత్రం అవే పదివేలు.
దటీజ్ హైదరాబాద్


ఏ సీజన్ చూడండి..ఏవో రకం. రకరకాల రంగురంగుల పళ్లతో దుకాణాలు ఎంత అందంగా వుంటాయో. రాష్ట్రంలో మరెక్కడైనా మూడు వందల అరవై అయిదు రోజులు ఇంతలా పళ్లు దొరికే నగరం ఒక్కటైనా వుందా? ఇక చిన్నా పెద్దా ఏ బేకరీనైనా చూడండి..ఎన్ని రకాల ఉత్పత్తులో..ఎక్కడి నుంచి వచ్చిందీ అలవాటు? ఒక్క ఈ అలవాటు అని ఏమిటి..ఇరానీ టీ, లుక్మీ, సమోసా, జిలేబీ, పకోడా, బేకరీ బిస్కెట్లు, పళ్లు, డ్రై ఫ్రూట్స్, బిరియానీ,లస్సీ,రుమాలీ రోటీ,హలీమ్, ఇలా ఎన్నో..ఒక దానితో ఒకటి సంబంధం లేని అభిరుచులు. ఉత్తరాది అందామా..దక్షిణాది అందామా..పర్షియన్..ఇరాన్..అనుకుందామా.. ఎక్కడైనా ఒక రకం సాంస్కృతిక అందాలు కనిపిస్తాయి. లేదూ అంటే ముంబాయి లాంటి మహానగరాల్లో ఏరియాని బట్టి లభ్యత, పద్ధతులు మారతాయి. కానీ హైదరాబాద్ అలా కాదు..విభిన్న సంస్కృతుల, పద్ధతుల, అలవాట్ల సమాహారం. ఇక్కడ అందరూ అన్నింటినీ ఇష్టపడతారు. అందరూ అన్ని రకాలను ఆస్వాదిస్తారు. రాజస్ధానీ, గుజరాతీయులు తెచ్చిన జిలేబీ, ఖాండ్వీ,్ఢక్లా..ఇరాన్ నుంచి వలస వచ్చిన హలీమ్, ఉడిపి హోటళ్లు అలవాటు చేసి ఇడ్లీ, వడ, దోశ, ఇంకా ఎందరో వచ్చి, ఎన్ని రకాలు అలవాటు చేస్తే, అన్నింటినీ అక్కున చేర్చుకోవడం హైదరాబాదీల మంచి మనస్సుకు నిదర్శనం.


సరే ఆహారం అలవాట్లు అలా వదిలేద్దాం. బతుకు పోరు చూద్ధాం.


ఎవరికి నచ్చిన దారి వారిది. ముందు వచ్చిన వారు చూపించిన తోవనే వారి వెనక వచ్చిన వారు నడిచి పోయేది. ఏనాడు వచ్చారో.. కన్నడిగులు. ఇవ్వాళ హైదరాబాద్, సికిందరాబాద్ నగరాల్లో నూటికి తొంభై పార్లర్లు వారివే. ఇరాన్ నుంచి వచ్చిన వారెందరో..ఆ పరంపర నేటికీ ఇరానీ టీలు, రెస్టారెంట్లు గా వర్ధిల్లుతూనే వుంది. ఇక సికిందరాబాద్ వర్తకమంతా నాలుగింట మూడు రెట్లుకు పైగా ఉత్తరాది వారిదే. మన పశ్చిమగోదావరి వాసులదే కొబ్బరి బొండాల వ్యాపార గుత్త్ధాపత్యం. నగరం నలుచెరగులా ఎక్కడ బొండాం తెగినా, కొట్టిన కత్తి పట్టిన చేయి గోదావరి జిల్లా వాడిదే. సైకిళ్లపై పచ్చళ్లు, టిఫిన్లు తూర్పుగోదావరి వాసులకు ఉపాధి కల్పనే. పాతబస్తీ వ్యాపారం అంతా మన ముస్లిం సోదరుల సముపార్జనే. ఇక అమీర్‌పేట అంతా కంప్యూటర్ శిక్షణాకేంద్రాలే. ఇక్కడ ఇట్టే నేర్చేసుకుని, అటు హైటెక్ సిటీవైపు అట్టే ఉద్యోగం పట్టేసే వారెందరో. ఆ జిల్లా..ఆ జిల్లా...ఈ రాష్ట్ర..ఆ రాష్ట్ర అని లేదు..ఎక్కడెక్కడి వారో, ఎవరెవరు కన్న బిడ్డలో..ఇక్కడకు వచ్చి, ఈ సంస్కృతికి, ఈ సరదాకు బానిసలై, ఇక్కడే వుండిపోయేవారు. వచ్చే వారు వస్తుంటే, ఉపాధి అవకాశాలు పెరుగుతూనే వున్నాయి కానీ తరగడం లేదు. ఎందుకని..ఇక్కడ దొరకని వస్తువు లేనట్లే..తయారవని సరుకు లేదు. నిజం హైదరాబాద్‌లో అన్ని రకాల సామగ్రి తయారవుతుంది. జోళ్లు,తోలు వస్తువులు, ఫ్యాన్లు, మిక్సీలు, కూలర్లు, బిస్కట్లు, ఇంకా ఎన్నో..ఎన్నో వస్తువులు హైదరాబాద్‌లో తయారై, పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్టుపై సరాఫరా అయి, పేరు మార్చుకుని, దేశం నలుమూలలా అమ్మకాలకు సిద్ధమవుతాయి. అన్నీ హైదరాబాద్ నలుమూలలా వున్న కర్మాగారాల్లో రూపుదిద్ధుకున్నవే. ఇక్కడి జనం పనితనం అటువంటిది. రాదు..తెలియదు..కాదు..అన్నది ఇక్కడ వినపడదు..మనం చెప్పగలగాలి..ఎలా కావాలో..ఏం కావాలో..అలా చేసేయగల నేర్పున్న జనం, అలా చేయడానికి కావాల్సి సామగ్రి అందించే మార్కెట్లు..హైదరాబాద్ స్వంతం. 


నిజం...కావాలంటే బేగం బజారే సాక్షి.

పలెట్లూర్లో దంపుడు బియ్యం దొరక్కపోవచ్చు. హైదరాబాద్‌లో రెడీ. వెండి, రేకులు స్వీట్లకు అద్దుకుతినడం సాధ్యం కావాలంటే చార్మినార్ దాటి పదడుగులు వేస్తే సరి. ఇళ్ల అందాలకు, ఇంటి సామగ్రి సొగసులకు అందమైన కార్వింగ్ పని చేయాలంటే హైదరాబాద్ కళాకారుల తరువాతే. కాలు పెట్టడానికి సైతం కనీసార్హత ఉండాలనిపించే కోట్లకు పడగలెత్తిన దుకాణాలు ఇక్కడ..కాలి నడకన తప్ప లోపలికి వెళ్లలేని కోఠీ, మోండా మార్కెట్లు ఇక్కడే. కొత్త పుస్తకం మార్కెట్‌లోకి వచ్చిన మూడో రోజునే అబిడ్స్ సెకండ్స్ మార్కెట్‌లో ప్రత్యక్షం. అక్కడ అయిదు వందలు..ఇక్కడ యాభై. ఏనాదో రామాయణం..మరే నాటిది సాహితీ సౌరభం..ఏదైనా సరే ఆదివారం ఇటు అబిడ్స్ నుంచి అటు కోఠీ మీదుగా చిక్కడపల్లి వరకు పేవ్‌మెంట్లపై కొలువుతీరుతాయి. కుర్రకారు నుంచి కవుల వరకు, పాఠశాల విద్యార్ధుల నుంచి, పరిశోధకుల వరకు అక్కడ అలా దేనికోసమో..వెదుకుతూనే వుంటారు.
ఇక సరే ఆహారం..వ్యాపారం..ఉపాధి..ఓకె. మరి రవాణా..
అదేం చిత్రమో..హైదరాబాద్ ఆంధ్రదేశానికి ఒక మూల వున్నా..ఒక్క రాత్రి చాలు..ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎగిరిపోవవడానికి. ఆ మధ్య ఓ ఆంగ్ల పత్రిక..చిన్న స్పెషల్ డైరక్టరీ ముద్రించింది. అతి తక్కువ వ్యవధిలో హైదరాబాద్ నుంచి చూసి రాదగ్గ ప్రదేశాలు అంటూ..చిత్రమేమిటంటే..ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాలే కాదు కదా..పక్క రాష్ట్రాల ముఖ్య ప్రాంతాలన్నీ ఆ జాబితాలో వున్నాయి. నిజమే కదా..సాయంత్రం ఆరు గంటల వేల బయల్దేరితే..బెంగుళూరు, బొంబాయి, మద్రాసు, విశాఖ, తిరుపతి, షిర్డీ..ఇలా ఒకటేమిటి ..వందలాది ఊళ్లకు తెల్లారి సూరీడు తొంగి చూసేలోగా చేరిపోవచ్చు. ఇది రైలు..బస్సుల సంగతైతే..మరి విమానలైతే.. ఖండాంతరాలే దాటేయచ్చు..శంషాబాద్ నుం చి రెక్కలు తొడిగిన లోహవిహంగాలు అలా అలుపులేకుండా ఎగురుతూనే వుంటా యి కదా..


ఇంత మంచి సదుపాయం వున్న ఊరును ఎవరు వదులుకుంటారు..బతుకు కోసం..

సరే బతుకు తెరువు, ఆదాయం, ఎవరి స్ధాయికి వారు ఖర్చు చేసుకునే అవకాశం..ఇంకా ఎన్నో వున్నాయి..
మరి కాలక్షేపం.. పదిమంది ఉన్న చోట మరి దానికేం లోటు. ఒక్క ఇరానీ రెస్టారెంటు చాలు..ఓ పూట గడిచిపోవడానికి. అలా అలా.. కబుర్లు రాలుతూనే వుంటాయి, టీ, సిగరెట్ పొగల నడుమ.
పెళ్లాం పిల్లలతో షికార్లకు ఎన్ని తావులున్నాయో..అందరికీ తెలిసిందే.
ఇన్ని సదుపాయాలతో పాటు ఎన్నో బాధలూ వున్నాయి.
ట్రాఫిక్, నీళ్లు, వేడిమి, ధరలు, ఇళ్లు..ఇంకా అప్పుడప్పుడు కర్ఫ్యూలు.. అయినా ఇక్కడ బతికే జనానికి అవేం పట్టవు.
అవి ఇక్కడ జన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. వాటిని ప్రత్యేకంగా గమనించుకోరు..గుర్తుంచుకోరు.
వాటితో కలిసి బతకడమే వారికి అలవాటు..అదే వారికి ఇష్టం.
హైదరాబాదీల మరో ప్రత్యేకత..బాధ..్భయం..రేపటిపై ఆలోచన కనపించని చిత్రమైన పద్ధతి. అందరిలోనే ఏదో కులాసా..ధలాసా తనం..దూసుకుపోయే మనస్తత్వం..ముఖ్యంగా కుర్రకారులో. కొత్తగా వచ్చిన ఇంజనీరైనా..దుకాణంలో చేరిన కుర్రకారైనా..ఒకటే తరహా స్టయిల్. పాతవారికీ పరిచయం..కొత్తవారికి కొద్ది రోజుల్లోనే అలవాటు..ఈ హైదరాబాద్ వాతావరణం..అదో మత్తు..గమ్మత్తు. అందుకే ఆ మత్తుకు, గమ్మత్తుకు దూరం కావడం ఎవరికీ ఇష్టం వుండదు. అందుకే అందరికీ కావాలి..
ఈ నగరం.. అందరూ హైదరాబాదీలే.. **

===========================
260 చదరపు కిలోమీటర్లకు పైగా....

 

హైదరాబాద్ నాలుగు శతాబ్ధాల కిందట నిర్మితమైన సుందర నగరం. ఆనాడు కేవలం మూసీ నది పరీవాహక ప్రాంతానికే పరిమితమైన ఈ నగరం కాస్తా ఇవ్వాళ నలుచెరుగులా అద్భుతంగా విస్తరించింది..ఇంకా విస్తరిస్తోంది. ప్రస్తుతం 260 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి వుందీ నగరం. సుమారు 60 లక్షల జనాభా. నిత్యం వేలాది మంది వలసదారులతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. సముద్రమట్టానికి 536 మీటర్ల ఎత్తున వున్న ఈ నగరపు వాతావరణం చాలా చిత్రమైనది. ఉష్ణోగ్రత, వర్షపాతం, చలి మూడూ కాస్త ఎక్కువే. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత నలభై అయిదు దాటడం, అలాగే శీతాకాలంలో పది డిగ్రీలకు పడిపోవడం, వర్షాకాలంలో అత్యధిక వర్షాలు హైదరాబాద్ స్పెషాలిటీ. అయినా గాలిలో తేమశాతం తక్కువ కావడంతో ఇక్కడ జనానికి అలసట కాస్త తక్కువగా అనిపిస్తుంది. దాని వల్ల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు అంతగా బాధించవు.
=========================
ఎన్నో వస్తువుల తయారీ.....

 

హైదరాబాద్ బ్రాండ్..ఈ పేరుతో ఏ వస్తువూ తయారుకావడం లేదు కానీ, చాలా వాటికి హైదరాబాద్ పెట్టింది పేరు. బిరియానీ, హలీం తదితర వంటకాలకు వున్న పేరు ప్రత్యేకంగా పేర్కొనక్కరలేదు. ఈ సంగతి ఇలా వుంచితే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు విక్రయించే వస్తుసామగ్రి హైదరాబాద్‌లోనే తయారవుతుంది. మస్కిటో కాయిల్స్, ఫ్యాన్లు, మిక్సీలు, ఎయిర్ కూలర్లు, చెప్పులు, షూలు, బేకరీ ఉత్పత్తులు, చాక్‌లెట్లు, ఇలా ఇంకా ఎన్నో వస్తువులు ఇక్కడి సంస్థలు తయారుచేసి, పెద్ద పెద్ద కంపెనీలకు అందిస్తే, వాటి బ్రాండ్‌నేమ్‌తో అవి మార్కెట్‌లోకి వస్తాయి. ఈ కారణంగా అనేక మందికి హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పారిశ్రామిక, ఉపాధీకరణ అవకాశాలు పెరగడం వల్లనే ఇక్కడకు నిత్యం వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది.

- వి.ఎస్.ఎన్.మూర్తి


1 comment:

Unknown said...

Pragati Resorts is the fastest growing Business in Hyderabad Real Estate including Resorts in hyderabad, Plots. Plots for sale in hyderabad. Properties in Hyderabad at affordable prices.